Thursday, August 31, 2006

నిశీధి లో నేను


చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను

నిశీధిలో నియంత బ్రతుకు అయినా...
ఉషస్సు చూడ‌లేక
తలనువంచిన ఈ క్షణం
ఇపుడు నాకు నఛ్చుతుంది

మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు
ఇక ఎప్పటికీ కాదు

అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు.........

ఎర్ర గులాబి


ఏ ప్రియుడి చేతిలో చేరి
ఏ చెలియ అలుక తీర్చాలా అని..
ఏ కన్నె సిగలో చేరి
ఎన్ని వగలు చూపాలా అని..
ఎన్ని హృదయాల మూగ భావాలు
ప్రేమగా మలచి వివరించాలా అని..
ఆలోచిస్తూ అందంగా ముస్తాబై
మంచు ముత్యాల చెక్కిలిగిలికి
చిలిపిగా సిగ్గుపడుతూ
చేరుకోబోయే చేతుల కోసం నిరీక్షిస్తూ...ఓ ఎర్ర గులాబి

Wednesday, August 23, 2006

చినుకులు


అందమైన సాయంత్రాన
అల్లరి పిల్ల గాలులు చల్లగ వీస్తూ
మెల్లమెల్లగ మబ్బులను తాకి మురిపిస్తుంటే...
చిటపట పాటలతో కురుస్తున్న
చిరుజల్లులోని కొన్ని తుంటరి చినుకులు చిత్రంగా
చిన్నారి దోసిట్లో ముత్యాలై పోతున్నాయి

Saturday, August 19, 2006

నిరీక్షణ


చెలి మాట‌ల వెల్లువల

అనురాగపు జల్లులు నన్ను అల్లాలని

అమె ఒడిలో సేద తీరాలని

చెలియ చలువ చెలిమి

చిరుఆశలు రేపగ

ఆశలు తీరే తరుణం కోసం

ఎన్ని యుగాలైనా నా నిరీక్షణం

Thursday, August 03, 2006

నీ జ్ఞాపకాలు


సన్నటి కన్నీటి పొర
అడ్డుపడుతూ వుంది
వదిలి వెళుతున్న నిను చూద్దామంటే
నువు దూరం అయ్యేకొలదీ
ఆవేదన జలపాతంలా
కన్నీరై చెంపలపై జారింది
ఇక ఏ అడ్డూ లేదు నిను చూడడానికి
నిజమే..ఏ అడ్డూ లేదు..
చివరికి నీ నీడ సైతం
ఇక అక్కడ వున్నవి
విలపిస్తున్న నా హృదయం
చెరిగిపోని నీ జ్ఞాపకాలు

మౌనం

ఎన్ని ఊసులో ఈ మనసులో 
నీకు చెప్పేందుకు 
ఇంతలోనే ఎంత మౌనమో 
నిను చూసినందుకు 
ఎన్ని భాషలొచ్చినా గాని నా మనసుకు 
మౌనమొకటే తెలుసు నా ప్రేమకు 
నిను గూర్చి ఎన్ని తలపులో కనులు మూసినందుకు 
వాటిని పదిలపరచుకున్నాను మనసుకి నచ్చినందుకు 

Tuesday, August 01, 2006

నీ ఊహల్లో


మనసు చదివే కావ్యాలెన్నో
అందమైన నీ చిరునవ్వుల్లో
భాష తెలియని భావాలెన్నో
నిను చూసే నా కన్నుల్లొ
కవితకందని అందాలెన్నో
నిను వెతికే నా ఊహల్లో
కనులకే తెలియని కలలెన్నో
నిను తలచిన క్షణంలో

అతడు


చాలా చెప్పాలనుకున్నాను అతనికి
కాని ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి
ఎన్ని చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది
ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది
అతను ఎదుటపడితే తప్పుకుంటాను
ఒక క్షణం కనిపించకపోతే తపించిపోతాను
అతడు చూస్తూవుంటే తల వంచుకుంటాను
చూడకపోతే బాధపడుతుంటాను
నన్ను చూసి నవ్వుతుంటే తడబడిపోతాను
ఎవరూ లేని సమయం లో చాటుగా
అతన్ని చూస్తూ నిలబడిపొతాను
ఇలా వెంటపడుతున్నావేమిటని తిట్టాలనిపిస్తుంది కానీ....
మరుక్షణం అలా చేస్తూ వుంటేనే బాగుందనిపిస్తుంది
నాలో కలిగే ఈ భావనలకి పేరేమిటి?
ప్రేమా?ఆకర్షణా?

శిక్ష


మనిషి చేసే తప్పులకు
మనసు వేసుకుంటుందేమో శిక్ష
అందుకే పాపం దానికి అన్ని గాయాలు

కవిత‌


మనసు లోని భావాలు
మాటలుగా చెప్పలేనివేళ
అవి కలలై ..అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యద తీరాన్ని తాకినప్పుడు
మదిలోయల్లోంచి పలికేదే కవిత

ఆశలు


ఓ చినుకునై ఈ నేల చేరి
పొత్తిళ్ళలో పైరు పిల్లలనెత్తాలని
ఆ గాలినై ప్రతి పూవు తాకి
నిత్య సుగంధాలు వెదజల్లాలని
ఓ భావనై ప్రతి మది ని దాగి
యద తలుపులు తడుతూ ఉండాలని
ఒక భావమై కలములో దూరి
కమ్మని కవితామృతం చల్లాలని
చిన్నారి పెదవినై ప్రతి బుగ్గపై
ముద్దు తాలూకు తడి జ్ఞాపకంలా మిగలాలని....
ఎన్నెన్ని ఆశలు.......ఎన్నెన్నో ఆశలు....

దాచేసుకోవద్దు


మేఘ సంగీతానికి
నెమలి పరవశంలో మునిగి
పదం కలపడం మానట్లేదు గా
వసంతపు వర్ణానికి మురిసి
కోయిల గొంతు కలపడం మరచి
మూగబోవట్లేదుగా
ప్రకృతి లో అన్నీ..మనసు నిండగానే
మైమరచి భావాలన్ని వ్యక్తం చేస్తున్నాయి తప్పి0చి
మనలా...గుండెల్లో..కన్నుల్లో దాచేసుకోవట్లేదుగా
మరి మనిషెందుకు మనసు నిండగానే మూగబోతాడు?

నిను చేరకముందే


భావం భాషగ మారకముందే
మనసు మూగబోయింది
మోడు చిగురులు వేయక ముందే
వసంతం వెళ్ళిపోయింది

కల కన్ను తెరవక ముందే
కరిగి కన్నీరైపోయింది
నా దారి నిను చేరకముందే
గమ్యం మారిపోయింది

నా పయనం ఆగిపోయింది

మరచిపోకు నేస్తమా...

నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???

లాస్యం


అధర కాగితాలపై విరిసే
సుమధుర కవిత
మనసుల్ని దోచే
హిమ వీచిక
మృదు మధుర దరహాసిక
ఓ సుందర జ్ఞాపిక
కలతల్ని మరిపించి మురిపించే
అనిర్వచనీయ కానుక
మాట రాని మనసులకు పలుకు నేర్పే
లిపిలేని భావమిదే ఇక.

నీకోసం

శూన్యంలో సైతం వెతుకుతున్నా 
ఊహకందని నీ రూపుకోసం 
నిను వర్ణించడానికి 
అందమైన భాషకోసం 
గాలినై పయనిస్తున్నా 
అంతుచిక్కని నీజాడ కోసం 
వెచ్చనైన నీ స్పర్శ కోసం 
ప్రియా ... ఎప్పుడు కనిపిస్తావు? 

మరపు

ప్రతి నవ్వులో నీ మాట వింటూ 
ప్రతి మోములో నీ రూపు కంటూ 
ప్రతి అనుభూతిలో నీ ఆనవాళ్ళంటూ 
చదివే ప్రతి పుటలో నువ్వున్నావంటూ 
ఇలా బ్రతికేస్తున్నానంతే... .. 
నిజానికి ఎదీ నువ్వెక్కడున్నావు? 
నువ్వొక జ్ఞాపకమంతే 
గుర్తు చేసుకుంటే గుర్తొస్తావు 
అదొక అనుభూతి అంతే 
వద్దనుకుంటే మర్ఛిపోగలను......... మర్ఛిపోయాను

నువ్వు లేకపోయినా


అనుకోకుండా కలిసి
అడగకుండా యదలో చేరి
ఆశలు రేపి ఆశయం చూపి
మనిషిని చేసి
మనసుని దోచి
మదిలో నిలిచిన ఆమె నన్నొదిలి వెళితే..
నేను జీవించగలనా?
జీవించినా ఆమె జ్ఞాపకాలతో మామూలుగా మనగలనా?
అనుకొన్నా!
ఇది మూడేళ్ళ క్రితం మాట
కాని ఇంతలోనే బ్రతికేస్తున్నా

ఆమె జ్ఞాపకాలు మచ్చుకి సైతం లేకుండా

స్నేహం


ఈ స్నేహం..ఈ ఆనందం
శాశ్వతమవుతాయనుకున్నాను
ఇలా నా జీవితం
స్నేహితులతో వసంతం లో
పున్నమి వెన్నెల రేయి లాగడిచిపోతుందనుకున్నాను
అదేమిటో...కాలానికి స్నేహం పై తగని కక్షేమో
చిరునవ్వులు ఛిన్నం చేసేందుకు
త్వరత్వరగా కదిలిపోతుంది
సంవత్సరాలని క్షణాలలా కరిగించేస్తుంది
విడిపోక తప్పదని గుర్తుచేస్తుంది
స్నేహమా....గమ్యం నీవవుతావనుకున్నాను
కానీ మజిలీ చేసి వెళుతున్నాను
.............................................
 

తోడుగా ఆలోచనల్లో నా నేస్తాలు...
జ్నాపకాలలో నవ్వుల పూవులు పూయిస్తూ
శూన్యాన్ని సైతం సందడిగా మారుస్తూ..

నీ మౌనం

మౌనం భాష అయినప్పుడు 
పెదవులు చిరునవ్వుతో పలకరిస్తాయి 
కన్నులు చెమ్మగిల్లి కధలెన్నో చెపుతాయి
అందుకే.. మౌనం మాట్లాడుతుందంటాను!

ప్రకృతి

వెన్నెల ధారల్లో స్నానమాడి 
 పొగమంచు చీర కట్టిన వనకన్యను 
 ఆర్ధ్రంగా తట్టి లేపింది ఏటివాలు కొండ గాలి ! 
 నిశి ముసుగు మాటున 
 కరి మబ్బు నీడనున్నఉషాకిరణుడికి 
 శుభోదయం పలికింది కోయిలమ్మల జోడి ! 
 వెఛ్ఛగ సూరీడే తాకగ 
 పలకరించిన పులకరింతతో పరవశంగా 
 ఒళ్ళువిరుచుకుంది వయ్యారి మయూరి !

పదహారు ప్రాయం

ఊహల ఉయ్యాలలో ఊగుతూ
ఆశల రెక్కలపై
హద్దుల తీరాలను దాటి
అనంతాల ఆనందాలను కోరుతూ
కలల లోకంలో విహరిస్తూ
కవితాగానాలలో....స్నేహితుల సరాగాలలో

నిన్న జ్ఞాపకం గా
రేపు అద్భుతంగా
ఊహించేదే .......'పదహారు ప్రాయం'

సాగరం



ఉప్పు నీటిని మనసంతా నింపుకుని 
ఎన్నెన్ని తీయని జ్ఞాపకాలను  మిగుల్చుతుంది! 
పాదాలు తడిపి బంధువులా కుశలం అడుగుతుంది
ఒంట‌రి నీ నడకలో నేస్తం లా తీరం పొడవునా తోడొస్తుంది
చల్లగాలి సాయమిచ్చి అమ్మలా సేదతీరమంటుంది 
మనసుకు బోలెడన్ని సంబరాలిచ్చి 
అమ్మమ్మలా - మరలా తిరిగి రమ్మంటుంది !

స్నేహం


నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ఒకరు కావాలి
ఒకరికి సొంతమయ్యేందుకు నేను కావాలి !

భయం


కనులు తెరవాలంటే భయం
కలలోనే నీ రూపం కనుమరుగయిపోతుందని
కనులు మూయాలంటే భయం
ఎదుటనిలిచిన నిను చూడలేనేమో అని
వాస్తవం లోకి చూడడం భయం
కలలోనే నువ్వు మిగిలిపోతావని
స్వప్నం లోనే వుండడం భయం
నిజం లో నిన్ను కోల్పోతానేమొ అని
నిను గూర్చి ప్రతీదీ భయమే...
కలుసుకోవాలంటే భయం
విడిపోతామేమోఅని
విడిపోవాలంటే భయం
ఇక కలుసుకోలేనేమొ అని
నిను మరచిపోదామంటే భయం
నే జీవించలేనేమో అని
పోని మరణిద్దామంటే భయం
ఇక నిను చూడలేను కదా అని
ఇలా... అన్నీ..భయం భయం భయం

పోగుపడిన భావాలు



నీకై తపిస్తున్న ఈ మనసు ఘొష వినలేవా?
నా కన్నుల మూగ భాష కనలేవా?
.....................................................
నీకన్నుల వెలుగు చాలు నా శ్వాశకి
నీ నవ్వుల మెరుపు చాలు ఈ జన్మకి
.....................................................
నీ దరి చేరలేకపోతున్న నా హృదయం
ఆవేదన మయం
......................................................
కెరటంలా తాకావు  హృదయాన్ని
కలల వాకిళ్ళు గా మార్చావు కన్నుల్ని
......................................................
మనసు పొరలలో దాగిన
అనుభూతుల దొంతరలను విడదీస్తూవుంటే
అన్నీ నీ తాలూకూ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి
అవి పెదవులపై విరబూస్తున్నాయి
......................................................
చెమ్మగిల్లాయి కన్నులు
ఎన్నటికో కలుసుకున్న అనందంతో
తడినిండాయి అవే కన్నులు మరునిమిషంలో
విడిపోతున్న విషాదంతో
......................................................
నిను చూడగానే ఉప్పొంగిన ఆనందపు అల
ఎగసిందలా..ఆ నింగిని తాకిందనిపించేలా
......................................................
అలుపెరుగని కెరటం నా హృదయం
దిగంతాలదాకా నా పయనం
......................................................
ప్రియా ...చెప్పాలని వుంది నీ రూపు కవితగా
పాడాలని వుంది నీ నవ్వు పాటగా
.....................................................
పలుకురాని నా హృదయంలో వెలికి రాని భావాలెన్నో....
.....................................................
ఊహలకు దారినిచ్ఛేది ఒంటరితనమే
....................................................

కొన్ని ఆలోచనలు ఇలా...


గతమంతా చిరునవ్వుల చరిత
నువ్వు వెళ్ళాకా..
బ్రతుకంతా ఓ విషాదాంత కవిత‌ !
నినుగూర్చిన కలలన్ని కరిగిపోయాయి
కన్నీరై చెంపలపై జారిపోయాయి !
......................................................
తోడులేదని గాలితో కబురంపగా...
నడిరేయిలో వినువీధి లో
జాబిలై నను పలుకరించింది
వెన్నెలై తలను నిమిరింది !
.......................................................
ఎవరూ ఎవరికి ఏమీకాము
అయినా 
అందరు అందరికి అయినవాళ్ళయ్యాము !

మనసుపడితే


ఏంచేస్తున్నా నీ జ్ఞాపకాలే
ఎటు చూస్తున్నా నీ ఆనవాళ్ళే
మనసా........మనసు పడితే దాగిపోతాయా ఊసులు

చెలరేగుతాయా ఆశలు
....................
శిశిరం లొ వెన్నెల వేళల్లో
శిఖరాలనుండి జాలువారే
పూవుల జలపాతం లా వుంది ఆమె అందం
ఎన్ని కన్నులకు వేసిందో బంధం
పాపం! ఎన్ని హృదయాలకు అయ్యిందో గాయం!

ఆ క్షణం


ఎన్నాళ్ళో ఎదురుచూసిన తరుణం
తరలి వచ్చింది నా కోసం
తీసుకొచ్చింది మధుమాసం
ఎన్నో చెప్పాలనుకున్నాను ఆ క్షణం
చెప్పలేక తడబడుతున్నాను ప్రతీ అక్షరం
కానీ.....

మాటలన్ని మౌనాలై తనని పలకరించాయి
మదిలోని భావాలన్ని నవ్వులై ఊసుల్ని తెలిపాయి
పట్టలేని ఉద్వేగంతో రెప్పలేమో వాలిపోయాయి
వలపులన్ని సిగ్గులై తలను వంచేసాయి
నాఓరచూపుతో తన కొంటె చూపు కలిసి 
చెక్కిళ్ళు చిక్కబడి పోయాయి
ఆ మనసుతో ఈ మనసు చిక్కుబడి 

నూరేళ్ళ బంధంతో ముడిపడిపోయాయి