Monday, October 30, 2006

ఓ ప్రేమికుడి ఆవేదన


నన్ను తాకిన అ తీయని భావన
నీ వరకూ చేరలేదా?
ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...

నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి
నువ్వింకా మోడుగానే వున్నావేమిటి?
ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...

Thursday, October 19, 2006

ఇంకా ఎంత కాలమిలా..?


గోల పెడుతున్న మాటల గువ్వలను
ఎగరనీయకుండా భావాల రూపం లో
గుండె లోనే బంధించేస్తూ
ఇంకా ఎంత కాలమిలా..?

మనసుకి స్నేహం మత్తు నిచ్చి
నిద్రపుచ్చుతూ
మాటలకు మౌనం భాషనేర్పి
నవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?

ఆగని కాలంకేసి భారంగా చూస్తూ
భారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ..చూస్తూ..అతడిని దూరం చేసుకుంటూ
ఇంకా ఎంత కాలమిలా..?

Friday, October 13, 2006

నీ జ్ఞాపకం కాదు-నువ్వు కావాలి

నా వల్ల కాదు నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు 
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో మరో జ్ఞాపకమైపొతున్నావు 
వెన్నెల వెలుగులో - వాన చినుకుల్లో 
సంద్రపు అలల్లో.... కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి 
దూరమవుతున్నాననుకుంటూ మరింత దగ్గరైపోతున్నాను...
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాన
ఇప్పటికి అర్దమయింది 
నేను వదులుకుందామనుకుంటుంది 
నీ జ్ఞాపకాన్నే గానీ ...నిన్ను కాదు అని...

Wednesday, October 04, 2006

తన రాక కోసం

నువ్వు చెప్పే తొలకరి చినుకుల్లాంటి 
ముద్దు మాటల్లో ముద్దగా తడిసిపోవాలని 
తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను 
ఒంటరిగా కాదులే... తోడుగా నీ తలపులే ! 
నువ్వు ఒకసారి వచ్చి 
వేల వసంతాలను కానుకిచ్చివెళతావు 
అనుభూతుల వానలో తడిపి 
ఆరేలోపు వచ్చేస్తానంటావు
నాకు మాత్రం 
మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్ల తో 
రేయి కల లా సాగిపోతుంది 
నువ్వు తెచ్చే నవ్వుల కోసం 
ఎదురుచూపుల్లో మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది !