Monday, February 26, 2007

నేను


ఎన్నెన్నో మెలకువ రాత్రుల్లో
మధించబడిన హ్రుదయం...
అమృతం జనించింది ఆశయ రూపంలో

ఖర్చు చేసిన క్షణాల విలువ
ఒక ఉదయం మనిషి గా మరో జననం

ఎదురుగా లక్ష్యం - సైనికుడిలా నేను

చేరడానికి దారిలేదు - దీక్ష తప్ప
పర్వాలేదు - చదునుచేస్తాను
వెనుకవచ్చువాళ్ళకోసం బాటలేస్తాను..

ఎదురుగా లక్ష్యం - కార్మికుడిలా నేను

Monday, February 19, 2007

ఇప్పటికైనా..


నన్ను మాట్లాడనివ్వు...
లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలు
ఆనందాలు,కన్నీటి సవ్వళ్ళను
ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు !

చాలు...ఈ మూగ రోదనింక చాలు
గుండె పాటను గొంతులో ఆపేసిన
ఆనవాళ్ళు చెరిగిపోయేలా
ఒక్కసారి కేక పెట్టనివ్వు...
ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు!

వర్షించడానికి సిద్దం గా
ఎన్నేళ్ళ భావాలో?
ప్రవాహం లా
ఎన్నెన్ని కన్నీళ్ళో?

Wednesday, February 14, 2007

చిరుగాలి కోపానికి..

అలుపు తీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైపోతే
చిగురుటాకులా వణికిపోతున్నాను..!
కానీ..
ఈ సుడిగాలి జడివాన కురిపించి
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతానుగానీ
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను

Saturday, February 03, 2007

నీ జ్ఞాపకం


ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా

పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది