Sunday, December 25, 2022

నీ జ్ఞాపకం

ప్రయాణంలో ఎక్కడ జారవిడుచుకున్నానో నీ జ్ఞాపకాన్ని

నాతో నువ్వు లేవన్నమాటే తెలియనంతగా
ఎలా…ఎలా?
నిన్నే మర్చిపోయేంతగా
ఏం జరిగిపోయిందీ జీవితంలో ?
నిన్ను అట్టడుగు పొరల్లోకి నెట్టేసేటన్ని
అనుభవాలు సంపాదించానా?

నీ జతలేని క్షణమే లేదుగా నా గతంలో!

సర్ధి చెప్పుకుంటున్నానులే మనసుకి
నా తప్పేం లేదు…
కాలం అన్నిటినీ మాయం చేస్తుంది
గాయాన్నైనా….జ్ఞాపకాన్నైనా!

( first publish in vakili web magazine May 2017 )

Thursday, December 22, 2022

నీకోసమే

అలసిపోయి కాదు నడక ఆపింది ...

కాసేపు కళ్ళు కలుపుదామని !

తెలియక కాదు అలుసైపోయింది

ఇంకో నాలుగు నవ్వులు విందామని!


దిష్టి

  సాయకాలం ...

ఎన్ని పూలు నిన్ను చూసి చిన్నబుచ్చుకున్నాయో!

ఎన్ని కళ్ళు నిన్ను మెచ్చుతూనే 

మూతి ముడుచుకున్నాయో!

తుమ్మెదలూ , సీతాకోకలూ సరేసరి !

పిల్లగాలికీ మనసైనట్టే వుంది ...

నీ చుట్టే తిరిగిందిగా మరి

అమ్మో ...

ఎంత దిష్టితగిలిందో ఏంటో

నా బంగారానికి!

లవ్

 నీ పక్కనే  సోఫా మీద కూర్చునో 

నీ వెనుకెనుకే తిరుగుతూనో వున్న 

నన్ను కాస్త పట్టించుకో ! 

నవ్వుకుంటూనో ....విసుక్కుంటూనో 

నీదగ్గర విడిచిపెట్టిన ప్రాణాన్ని మాత్రం 

కాస్త భద్రం గా  చూసుకో !

బావుంది !

నువ్వు గుర్తురాని నిమిషాలు ఏరుతున్నాను...గుప్పెడుకూడా లేవు !

బావుంది... అంతా నువ్వైపోవడం  బావుంది!