Sunday, December 17, 2006

కన్నీటి లేఖ



నేస్తం
నీ కన్నీటి ని చూసి
నా గుండె నిండి పోయింది
నువ్వు చిందించిన కన్నీరు
నాకు భరోసానిచ్చింది

నేస్తం... నీకు గుర్తుందా...
ఆ రోజు నువ్వు
నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం...

అందులో కన్నీటి చుక్కలతో
అలుక్కుపోయిన అక్షరాలు
చెప్పేసాయి మన స్నేహం గాఢతని

ఆక్షణం
నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని?
నాకోసం బాధపడే హ్రుదయం
ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని?

ఇంతకీ ..
నా కనుల కాగితం పైన
కన్నిటి చిత్రాలు
నీకు కనిపిస్తున్నాయా మరి?

Wednesday, December 13, 2006

నీ ఉత్తరాలు


చాలా మంది అంటారు
ఒక్కసారి కనులు మూసుకుని
జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!

కానీ నేను...
నిను తలచినప్పుడల్లా
నువు పంపిన ఉత్తరాలు తెరుస్తాను

కనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుంది
అదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!

అక్షరాల్లో దాగిన అనుభూతులని
కళ్ళతో ఏరుకుంటూ..
పాత అనుభవాలను
కొత్తగా పరిచయం చేసుకుంటూ..
మడిచిన ఉత్తరాల్లో దాగిన
ఎన్నో తీయని స్మృతులని
వెచ్చగా అనుభవిస్తూవుంటాను

ప్రసాద్ గారి "ఉత్తరాలు" స్పూర్తి తో

Friday, December 01, 2006

రేపటి ఉదయం



ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో

మనసు మెదడు తో యుద్దం చేస్తుంది

ఫలితమే ఈ నిదురలేని రాత్రి

అయితేనేమిలే...
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను

అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను

ఓ నిరాశా...
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం...నాది....