చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం
గుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
వెచ్చని తలపులు కప్పుకున్న హృదయం
చెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది
అలారం మోతలతో
ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలలులేని కలత నిదురలు
పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని
పొందుతున్నది పంచుకోలేని
భారమయిన బిజీ జీవితాలు
త్రుప్తి తెలియని చింతా చిత్తాలు
పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ
రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....
ఇక ఇంతేనా ఈ తరాలు
మార్పు తెచ్చేనా భావితరాలు!
తొలి ప్రచురణ poddu.net లో