Tuesday, May 01, 2007

ఈ తరం


అలారం మోతలతో
ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలలులేని కలత నిదురలు

పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని
పొందుతున్నది పంచుకోలేని
భారమయిన బిజీ జీవితాలు
త్రుప్తి తెలియని చింతా చిత్తాలు

పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ
రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....
ఇక ఇంతేనా ఈ తరాలు
మార్పు తెచ్చేనా భావితరాలు!

తొలి ప్రచురణ poddu.net లో

25 comments:

కొత్త పాళీ said...

రాధికగారూ, పొద్దులో గడిచట్రంలో పడి ఈ చిన్నిముత్యాన్ని గమనించలేదు.
చాలా బాగుంది. చక్కటి గతి ఉంది పద్యంలో.
అచ్చ తెలుగు మధ్య "బిజీ" అనే మాట రాయిలా తగిలింది.
చివరి లైను నిస్సహాయంగా కొంచెం పేలవంగా ఉంది- ఈ రెండూ వీలైతే మార్చండి.

Anonymous said...

తలుచుకుని తృప్తి చెందడం తప్ప దాని గురించి ఈ గజిబిజి జీవితం లో చెయ్యగలిగిందేముంది?

చెప్పడం బాగుండి.
మనం (నేను కూడా) నిట్టూర్చడం బాలేదు.

Vissu said...

mee kavitha bavundi.

J-O-S-H (My Bench !) said...

chala bavundi. nice rhyming..
"pogottukuntunnadi polchukoleni,
pondutunnadi panchukoleni.." well said.

సత్యసాయి కొవ్వలి said...

పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని
పొందుతున్నది పంచుకోలేని
భారమయిన బిజీ జీవితాలు
త్రుప్తి తెలియని చింతా చిత్తాలు

అక్షరలక్షలు చేసే వాక్యాలు. ఒకవేళ కలలు కన్నా అవి డెడ్లైన్లమీదో ఇంకా ఆలాంటివాటిమీదే వస్తాయేమో?

ప్రసాద్ said...

మళ్ళీ ఓ ఆణిముత్యం మీ కలం నుండి...

ఇక్కడ నా మరాఠీ మితృడు నన్నాటపట్టిస్తున్నాడు తెలుగులో busyకి అర్థం చెప్పమని... మీ కవితలో బిజీ చూసి ఇక అంతేనా అనిపించింది. ఆ మద్య ఎక్కడో తాడేపల్లి గారు ఏదో పదం వాడారు.

--ప్రసాద్
http://blog.charasala.com

radhika said...

కొత్తపాళీ గారూ మీ సూచనకు థాంక్స్.చివర ముగింపు అతి సాధారణం గా వుందని తెలుసు గానీ ఇన్నాళ్ళు ఆలోచనలు ముందుకి సాగక ఏదోక ముగింపు ఇవ్వాలనే తొందరలో అలా రాసాను.బిజీ అన్న చోట ఏమి రాయాలో తట్టట్లేదు.మీరే సూచించండి.చివరి వాక్యం ఇలా మారిస్తే ఎలా వుందో చెప్పండి
"ఇక ఇంతేనా ఈ తరాలు
వింతేనా ప్రశాంత జీవనాలు"
విహారి గారూ నిజమే నిట్టూర్పులతో మార్పు తేలేము.ఏదో ఒకటి చెయ్యాలి.ఏమి చెయ్యాలో అందరూ సూచిస్తే బాగుంటుంది.
విస్సు గారు థాంక్స్.
జోష్ నా కవితలన్ని క్రమం తప్పక చదువుతూ మీ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నందుకు థాంక్స్.
సత్య సాయి గారు మీరన్నది నిజమే.ఇరవయిల వయసుకే ఉద్యోగాలలో చేరి డెడ్లైన్ల పుణ్యమా అని కమ్మని కలలకు దూరం అవుతున్నారు.
ప్రసాద్ గారూ తాడేపల్లి గారు ఏ పదం వాడారో గుర్తుంటే చెప్పండి.
నిజానికి నాకు భాష మీద పట్టులేదు.ఆ విషయం కనిపెట్టిన వారు ఒకరు[పేరు గుర్తులేదు..తాడేపల్లి గారు ?] పడికట్టు పదాలను వదిలితే మీ కవిత్వం ఇంకా రాణిస్తుందని సలహా ఇచ్చారు.అప్పటి నుండి కొంత శ్రద్ద తో రాద్దామనుకున్నాను.కానీ భాషపై శ్రద్దతో నా ఆలోచనలు చిన్న పరిధికే పరిమితమయి పోయి మొత్తానికి ఏమీ రాయలేకుండా అయిపోతున్నాను. కానీ మరింత ప్రయత్నిస్తానని మనవి చేసుకుంటున్నాను.మీరందరూ ఇలానే మీ మీ అమూల్యమయిన అభిప్రాయాలను ,సూచనలను,సలహాలను అందిస్తూనే వుండాలని కోరుకుంటున్నాను.

Satyavati said...

రాధిక గారూ
ఉరుకుల పరుగుల పందెంలో ఏమి కోల్పోతున్నామో అర్ధం కాని పరిస్థితి.
టార్గెట్లు,డెడ్ లైన్లు రాజ్యమేలేచోట ఏమి పోగొట్టుకుంటున్నారో ఎప్పటికి అర్ధం కాదు.
నిద్ర కరువైన కళ్ళు కలల్ని మాత్రం ఏమి కంటాయి.
చిన్న చిన్న ఆనందాలు,బుల్లి బుల్లి సంతోషాలూ
కనుమరుగైపోతున్న చోట
నానావిధ వస్తు సముదాయ సేకరణే
జీవిత పరమార్ధంగా మారినచోట
అంతే.మార్పు మనలోపలి నుంచే రావాలి.

కొత్త పాళీ said...

బిజీ కి బదులు ఆ వరసని ఇలా రాసుకోవచ్చు
భారమయిన పరుగుల జీవితాలు
లేక
భారంగా ఈడ్చే జీవితాలు.

పద్యం ఆఖరు గురించి - నా ఉద్దేశం .. ఉన్నది మార్చక్కర్లేదు .. అలా నిరాశగా వొదిలెయ్యకుండా .. ఎటువంటి మార్పు కావాలో సూచిస్తూ ఆశాజనకంగా ఇంకో చరణం కలపమని.

శ్రీనివాసకుమార్ said...

భారమయిన గజిబిజి జీవితాలు.... "బిజీ"ని గజిబిజి చేశాను...

నేనుసైతం said...

ప్రసాద్ గారు,

బిజీ అంటే "అవిశ్రాంత" అనవచ్చా?

-నేనుసైతం

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...

వ్యాపృతుడు అంటే బిజీగా ఉన్నవాడు అని అర్థం. బిజీ అంటే వ్యాపృతం అనవచ్చు. గతంలో కొంతమంది రచయితలు కార్యవ్యగ్రుడనే పదం కూడా వాడారు. ఈ రెండో పదమైతే పలకడానికి కొంచెం కష్టం.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...
This comment has been removed by the author.
J-O-S-H (My Bench !) said...

I think busy is called "vyastamu" i confirmed it with my mother..can anyone correct it if its wrong...?
u can use "tvara" too..but nothing fits the poem though!
well i am glad to read some good telugu and also glad that i am thinking about them later!

radhika said...

అందరికీ ధన్యవాదాలు.తాడేపల్లి గారు చెప్పిన అర్దం చాలా కష్టం గా వుంది.కానీ ఇలాంటివి తెలుసుకోవడం బాగుంది.జోష్ మీరు చెప్పింది వ్యస్తము అస్త వ్యస్తము లోని వ్యస్తమా?అలాగే మీరు చెప్పిన "త్వర" అంటే వేగం అని కదా అర్దం వస్తుంది. నేను సైతం గారూ అవిశ్రాంత అనే ఆలోచన నాకు వచ్చింది కాని అది కుడా సరైన పదం కాదనుకుంటాను.శ్రీనివాస్ గారు మీరు చేసిన గజిబిజి బాగుంది. కొత్త పాళీ గారు ఇంకో చరణం ఆలోచిస్తాను.బిజీగా వుండి సమయం చిక్కట్లేదు.

Lalithaa Sravanthi Pochiraju said...

మీ 2వ చరణం నాకు బాగా నచ్చింది
keep going

savitri said...

hi radhika garu meekavithalu bagunnai

jags said...

రాధిక గారు....
మనుషుల అలసట సేదతీరితే పోతుందేమో కానీ ఈ అలసిపోయిన మనసులని సేద తీర్చేదెలా?? ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇటువంటి సంధిగ్ధావస్తలో నుంచి వెల్తారేమో. నిజమే ఏదో చెయ్యాలనే ఆరాటం ఏమీ చెయ్యలేని నిస్సహాయతని చక్కగా వర్ణించారు. 'బిజీ' అనే పదాన్ని మార్చమని మిత్రులు సూచనలు సబబే అనిపించినప్పటికీ అక్కడ గందరగోల పరిస్తిలుని వర్ణించటానికి అదే సరైన పదంగా నాకు తోచింది. అంతగా మార్చాలనిపిస్తే 'గజి-బిజీ అనే పదాన్ని వాడటం ప్రత్యాన్మయంగా కనిపిస్తుంది.

ఇక ముగింపు అంటారా...ఇటువంటి సమస్యలకి ఒక్కొక్కొరి మనస్సు ఒక్కొక్కరకమయిన సమధానాన్ని వెతుక్కుంటుంది అని నా అభిప్రాయం. చక్కగా ఉంది కొన్ని ప్రశ్నలని ప్రశ్నలుగా వదిలెయ్యటమే పాఠకుల్లో ఆలోచించేలా చేస్తుంది అని నా నమ్మకం.

Sravan Kumar DVN said...

రాధికగారూ,మీకవిత చాలా బాగా ఉంది !

" అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు "
అని చదవగానే, నా ఫోన్ శబ్దాలు, కొన్ని రింగ్ టోన్స్ చేసే గోల గుర్తుకు వచ్చాయి.

"పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని
పొందుతున్నది పంచుకోలేని"

"పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ"

ఈ లైన్స్ చాలా బాగున్నాయి.
మీ బ్లాగ్ లో కవితకు తగ్గ చిత్రం ఉంచుతున్నారు. చాలా బాగుంది.

Anonymous said...

excellent Radhika..!!! epitomizing the situation of current gen

Sridhar said...

యేమైనా, జాజిపూల సువాసనల్తో మమ్మల్ని వూపిరాడకుండా చేసి యింకా యే పరిమళాల్తో సిద్దంగా వున్నారు.

MADHUVU said...

మీ కవితలు చాలా బాగున్నాయి. అచ్చ తెలుగులో కొన్ని ఆంగ్ల పదాలు తొడైనకూడా ప్రాస చెడకుండా మనస్సును హత్తుకుంటున్నాయి. కవితలకు జోడించిన చిత్రాలు అధ్బుతం.

Anonymous said...

మీ కవితలు చాలా బాగున్నాయి. అచ్చ తెలుగులో కొన్ని ఆంగ్ల పదాలు తొడైనకూడా ప్రాస చెడకుండా మనస్సును హత్తుకుంటున్నాయి. కవితలకు జోడించిన చిత్రాలు అధ్బుతం.

Rakiii said...

challa bagunadi,

i liked it!

meher said...

రాధిక గారు మీరు వ్రాసేవి కవితలు కావు నమ్మదగ్గ వాస్తవాలు అర్ధవంతమైన రీతిలో మా లాంటి అభిమానులకు మీరిచ్చే అపురూప కానుకలు..
మీ పయనం ఏకధాటిగా సాగాలని ఆశిస్తూ ఓ అభిమాని...

ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఒకటుంది తెలుగు భాషంటే నాకు ప్రాణం.నా మనసుకి తోచింది మొట్ట మొదటి సారి తెలుగులో తెలుగు అక్షరాలతో తెలియచేస్తున్నందుకు గర్విస్తున్నాను...

Meher...