Saturday, September 30, 2006

ఆ క్షణం



అతని గుండె నిండిపోయిందనుకుంటాను
కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి - మరి
చెదిరిన జ్ఞాపకాలు ఏరుకున్నాడో
నిజమయిన చెలిమిని కనుగొన్నాడో

అతని మనసు మౌనమనే కొత్త భాష నేర్చుకుంది
ఆనందాన్ని వ్యక్తపరచడానికి

Thursday, September 21, 2006

కన్నీరు

tears
ఈ బరితెగించిన బాధ ని చూడు
కనుల సరిహద్దును దాటి
చెంపలను తడుపుతుంది

కనికరం లేని కన్నీళ్ళు
ఎంత ఆపినా ఆగట్లేదు

సంతోషమా నువ్వొచ్చి కట్టడిచేయొచ్చుగా....

Monday, September 18, 2006

ఎదురుచూపు


అసలే నీ ఆలోచనలతో అలసిపోయిన అంతరంగం
నీకై ఎదురుచూసి ఎదురుచూసి సొలసిపోయింది

మెల్లమెల్లగా చీకట్లోకి చేరిపోతున్న వెలుగులా
కనులు నిజాన్ని విడిచి స్వప్నంలోకి జారిపోతున్నాయి
ఎప్పటికి తేరుకున్నానో..
కానీ అప్పటికే జీవితాన్ని చేజార్చుకున్నాను

కనుల కొలను నుండి చిమ్మిన ఆఖరి కన్నీరు బొట్టు
నువు తుడవకుండానే ఆవిరైపోయింది

చెంపలపై కన్నీటి చారికలు మాత్రం మిగిలినై
మన ప్రేమకు [క్షమించాలి....నా ప్రేమకు]అవశేషాలు గా

Thursday, September 14, 2006

నిజమేనేమో?


కనులకు నచ్చినదానికన్నా మనసుకు
నచ్చిందే విలువైనదిగా అనిపిస్తుంది
మరణం కన్నా మరణిస్తామన్న ఊహే
భయంకరం గా అనిపిస్తుంది
వర్తమానం కన్న అది గతం లా
గుర్తుచేసుకున్నప్పుడే ఆనందం గా అనిపిస్తుంది
నాకు నీతో వుంటున్నప్పటికన్నా
నీ జ్ఞాపకమే హాయి గా అనిపిస్తుంది
ఎవరో అన్నట్టుగా
నేను నీకన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్నభావననే
ఎక్కువ ప్రేమిస్తున్నానేమో?

Wednesday, September 13, 2006

నువ్వు


ఏమిటో నీ ఊహల జడిలో
ఎంత తడిసినా తనివి తీరదు
అమ్మ చేతి గోరుముద్ద తింటున్నట్టుగా
వుంటుంది నీ జ్ఞాపకం
ఆకాశం లో హరివిల్లు విరిసినప్పుడల్లా
నీ నవ్వే గుర్తొస్తూ వుంటుంది

ఎందరి యదల రొదలో
నీ పేరు స్వరమై వుందో ..
ఎందరి కలల కన్నుల్లొ
నీరూపు నిలిచిపోయిందో నీకు తెలుసా

ఇంతకి నువ్వెక్కడ వున్నావు?
ఆరాధకుల గుండెల్లో కాకుండా..

నువ్వెప్పుడు వస్తావు?
రెప్పల మాటున స్వప్నం లా కాకుండా

Tuesday, September 12, 2006

ఆమె


తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను

తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను

గుండెల్లొ నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను

గతమై నా వెనుక వుంటానంది
జత గా నా పక్క నడవమన్నాను

జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను

మొదట ఓదార్చింది--తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపం లో ఆమె

Monday, September 11, 2006

ఓ భావన


ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను...ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ

అమ్రుతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనం తో వుంటుంది
అందరిని తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ...

మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]...ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ

Thursday, September 07, 2006

నువ్వు-నేను


నీ కళ్ళలోకి చూసిన ప్రతీసారి
నాకు తెలుస్తుంది..నా మీద నీకున్న భావనేమిటో
నాకోసం నీవుపడే ఆరాటం చెపుతుంది..
నేను నీకు ఏమవుతానో
అప్పుడప్పుడు నా కళ్ళకి పట్టుబడే
నీ కన్నుల తడబాటు చూస్తుంటే
భలే సరదా అనిపిస్తుంది
నీ యద ఘోష నాకు తెలుసురా..అని
చెవి మెలిపెట్టి మరీ చెప్పాలనిపిస్తూవుంటుంది
కానీ
ఇంతగా ఆరాధిస్తున్న నువ్వు
ఆ మాట చెపుతుంటే వినాలనివుంది
అందుకే...గోదారి లాంటి నా ప్రేమకు ఆనకట్ట వేసి
తొలకరి చినుకు లాంటి నీ మాటకై ఎదురుచూస్తున్నాను
నీ అడుగు తో జత కలిపే క్షణం కోసం ఆశగా నిరీక్షిస్తున్నాను

Wednesday, September 06, 2006

నా నువ్వు


ఎన్నో చిందర వందర ఆలోచనల మద్య
ఒక్కసారిగా నీ ఊహ
నీ తలపు రాగానే ఆలోచనలన్నీ అలిగి ఎటోవెళ్ళిపోయాయి
నీకూ నాకూ ఏకాంతం కల్పిస్తూ ....

తమస్సు లో తారలా
నా మనస్సు లో నువ్వు
ఆనందాలని సొంతం చేస్తూ..
అంధకారాన్ని దూరం చేస్తూ..